అనకాపల్లి : పట్టణంలోని దిబ్బవీధి కొబ్బరితోటలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో ఈనెల 19న స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు దాడి రత్నాకర్ గారు తెలిపారు. క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా మంగళవారం ఆలయంలో స్వామివారి తిరు కల్యాణం మరియు చందన మహోత్సవ పోస్టర్ను ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ సింహాచలం తరువాత అనకాపల్లిలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మళ్ల దాసుడు తాతయ్యలు నిర్మించారని తెలిపారు. ఎంతో పురాతనమైన ఈ దేవాలయం ప్రసిద్ధి చెందిందని చెప్పారు. సింహాచలం ఆలయంలో ఎటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారో అవన్నీ ఇక్కడ నిత్యం జరుగుతాయని చెప్పారు. ఆలయ నిర్వాహకులు మళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయన్నారు. మే 10న జరిగే స్వామివారి చందనోత్సవం (నిజరూప దర్శనం) జరుగుతుందని తెలిపారు. సింహాచలంలో స్వామి వారి నిజరూప దర్శనానికి భక్తులు హాజరవ్వడం కష్టతరమని, సింహాచలం వెళ్లలేని భక్తులందరు అనకాపల్లి దేవాలయంలో జరిగే చందనోత్సవం (నిజరూప దర్శనం)లో స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. మే 10న తెల్లవారుజామున 2 గంటలకు మేలుకొలుపు, రెండున్నర గంటలకు స్వామి చందనం వలుపు కార్యక్రమం, భక్తులకు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం ఉంటుందన్నారు. సాయంత్రం 6:30 గంటలకు పంచామృత అభిషేకాలు మరియు సహస్త్ర కలశాభిషేకాలు జరుగుతాయన్నారు. అనంతరం స్వామి వారికి తొలి విడత చందన సమర్పిస్తారని చెప్పారు. భక్తులంతా ఈ కార్యక్రమాలకు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించి తరలించాలని కోరారు. ఈ కార్యక్రమానికి 80వ వార్డు కార్పొరేటర్ కొణతాల నీలిమా భాస్కర్, వీధి పెద్దలు, మహిళలు, యువకులు పెద్దఎత్తున హాజరయ్యారు.