అనకాపల్లి: గవరపాలెం నూకాంబిక అమ్మవారి జాతర నెల రోజులు పాటు జరగనున్న సందర్భంగా ఆలయాన్ని జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఆలయ పరిసరాలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్ తదితర సంబంధిత అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్.అప్పలరాజు,అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ జి.శంకర రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.పైడపు నాయుడు మరియు దేవస్థానం ఈవో బండారు ప్రసాద్ లకు భద్రతాపరమైన సూచనలు చేశారు.నెలరోజుల పాటు జరిగే అమ్మవారి జాతర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించాలని, విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి బ్రీఫింగ్ చేసి, విధులు అప్పగించాలని, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో దృష్టి పెట్టాలని, దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని చెప్పారు. భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వారా హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు. రద్దీ వున్నప్పుడు తోపులాట జరగకుండా చూడాలని సిబ్బంది అప్రమత్తంగా వుండాలన్నారు. విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ తో పాటు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్.అప్పలరాజు, అనకాపల్లి టౌన్ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, దేవస్థానం ఈవో మరియు సిబ్బంది పాల్గొన్నారు.