అనకాపల్లి ఏప్రిల్ 5: స్వాతంత్ర్య సమరయోధుడు సమతా వాది బాబు జగజీవన్ రామ్ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. శుక్రవారం జగజీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త జగజీవన్ రామ్ చిత్రపటానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయన 1908 ఏప్రిల్ 5 తేదీన బీహార్ లోని భోజపురి జిల్లా చంద్వా లో జన్మించారని తెలిపారు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా దేశానికి సేవలు అందించారన్నారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారని 1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యారని తెలిపారు. గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారనీ,1946లో జవహర్ లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. భారతదేశపు మొదటి క్యాబినెట్ లో కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు. నలభై సంవత్సరాలకు పైగా వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా పనిచేశారనీ.1971 ఇండో పాక్ యుద్ధం సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నారని, వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవంతో వ్యవసాయాన్ని ఆధునీకరించడం1974 కరువులో దేశ ఆహార సంక్షోభాన్ని జయించడం లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. తరువాత జనతా పార్టీ కూటమిలో భారత ఉప ప్రధానమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, సాంఘిక సంక్షేమ శాఖ ఏడి అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.